- మండలిలో ప్రొఫెసర్ కోదండరామ్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: హార్డ్వేర్ పార్క్(మామిడిపల్లి) పేరిట 2004లో తీసుకున్న నిర్ణయం కారణంగా 20 ఏళ్లుగా భూములను వినియోగించుకోలేకపోతున్న బాధితుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. శనివారం శాసనమండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన.. భూసేకరణ జరగకపోవడంతో వ్యవసాయ భూములతో పాటు దాదాపు 20 వేల ప్లాట్లు వినియోగానికి నోచుకోలేదన్నారు.
బాధితుల పిటిషన్ను మండలి చైర్మన్కు సమర్పించి, భూములు ప్రజలకు ఉపయోగపడేలా తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే బీహెచ్ఈఎల్, అమీన్పూర్, రామచంద్రాపురం ప్రాంతాలకు ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం కల్పించేలా లింక్ కానీ, రేడియల్ రోడ్ ఏర్పాటు చేయాలని కోదండరామ్ ప్రభుత్వాన్ని కోరారు. ఓఆర్ఆర్కు సమీపంలో ఉన్నప్పటికీ సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోదండరామ్ సూచించారు.
